||సుందరకాండ ||

||పదునాలుగవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

||ఓం తత్ సత్||
శ్లో|| స ముహూర్తమివ ధ్యాత్వా మనసా చాధిగమ్యతామ్|
అవప్లుతో మహాతేజాః ప్రాకారం తస్య వేశ్మనః||1||
స|| సః మహాతేజః ముహూర్తమివ ధ్యాత్వా మనసా తాం (సీతాం) అధిగమ్య తస్య వేశ్మనః ప్రాకారం అవప్లుతః||
తా|| ఆ మహాత్ముడు ధ్యానము చేసి ఒక క్షణములో సీతను చేరి, ఒక గంతులో ఆ ప్రాకారము చేరెను.
||ఓం తత్ సత్||

సుందరకాండ.
అథ చతుర్దశస్సర్గః

ఆ మహాత్ముడు ధ్యానము చేసి ఒక క్షణములో సీతను చేరి, ఒక గంతులో ఆ ప్రాకారము చేరెను.

ప్రాకారము మీద వున్న, సర్వాంగములు ఉత్సాహముతో పులకించిన సర్వాంగములు కల ఆ హనుమంతుడు వసంతఋతువు రావడముతో పుష్పించిన వృక్షములను చూచెను. అక్కడ సాల అశోక భవ్య వృక్షములను బాగుగా పుష్పించిన చంపక వృక్షములను, ఉద్దాలక, నాగ వృక్షములను, కపిముఖవర్ణముగల మామిడి ఫలములతో వున్న చెట్లను చూసెను.

హనుమంతుడు మామిడి చెట్లతోనూ వందలాది తీగెలతోనూ నిండి యున్న వనవాటికను ధనస్సులోనుంచి వదిలిన బాణము వలే దూసుకుంటూ పోయెను.
హనుమంతుడు ఆ చిత్రమైన పక్షులకిలకిలారావములతో నిండినది , వెండి బంగారు రంగుల కల చెట్లతో నిండినది అగు ఆ అశోకవనమును ప్రవేశించెను. వానరుడగు హనుమంతుడు చిత్ర విచిత్రమైన పక్షి సంఘములతో మృగసంఘములతో ఉదయభాను సూర్యునిలా ప్రకాశిస్తున్నవనవాటికను చూచెను. ఫలపుష్పములతో నిండిన వృక్షములతో నిండిన ఆ వనవాటిక మదించిన కోకిలలచేత తుమ్మెదలచేత ఎల్లప్పుడూ సేవింఛబడినది. మనుష్యులకు హృదయానందము కలిగించు ఆ వనవాటిక మదించిన నెమళ్ళ గుంపులతో అనేక రకములైన పక్షుల గుంపులతో అలరారుతున్నది.
ఆ వానరుడు అమిత సౌందర్యవతి దోషములు లేనిది అగు ఆరాజపుత్రిని వెదుకుతూ సుఖముగా నిద్రపోతున్న పక్షులను లేపెను. ఆక్కడ వృక్షములు ఆ విధముగా లేచి ఎగురుతున్న పక్షుల రెక్కలచేత కొట్టబడి అనేక రంగులు కల పుష్పముల పుష్పవాన కురిపించినవి. ఆ అశోకవనిక మధ్యలో పుష్పములచేత కప్పబడిన హనుమంతుడు పుష్పమయమైన కొండలా శోభించెను.

ఆ వృక్షముల మధ్యలో అని దిశలలో పుష్పమయ రూపములో సంచరిస్తున్న హనుమానుని చూచి సాక్షాత్తు వసంతుడే సంచరిస్తున్నాడా అని అన్ని భూతములు భావించాయి. ఆ వృక్షములనుంచి పడిన పుష్పములతో విరాజిల్లుచున్న ఆ భూమి అందముగా అలంకరింపబడిన స్త్రీలా ఒప్పుచుండెను. అలా కదులుతూవున్న చేతులు గలవానరుని కదలికకి కంపింపబడిన వృక్షములు చిత్రవిచిత్రమైన పుష్పములను రాల్చినవి.

ఆకులులేనివి పొడుగైనవి పుష్పములు ఫలములు రాలిపోయిన ఆ వృక్షములు వస్త్రాభరణములను కూడా ఓడిఫోయిన జూదరులవలె వున్నాయి. వేగముగా తిరుగుచున్న హనుమంతుని చేత కంపింపబడిన పుష్పములతో నిండిన ఆ వృక్షములు పుష్పములను ఆకులను ఫలములను రాల్చాయి.

పక్షులచేత విడువబడిన, ఆ ఫలపుష్పములేని బోదెలతో వున్న ఆ వృక్షములు అన్నీపెనుగాలితాకిన వృక్షములవలె బోసిపోయి ఉన్నాయి.

హనుమంతుని తోక చేత హస్తములు కాళ్ళచేత మర్దించబడిన వృక్షములు కల ఆ అశోకవనిక జుట్టువిరబోసిన , బొట్టుచెదిరిన, తొలగిపోయిన అంగరాగములు కల పెదవులు దంతములు కల , నఖదంతములచే గాయపడిన యువతి వలె ఉండెను.

ఆ వానరుడు పెద్ద తీగలపొదలను మారుతము మేఘజాలములను చెల్లాచెదరు చేసినట్లు చిన్నాభిన్నము చేసెను.
అక్కడ తిరుగుచున్న ఆ వానరుడు మణులతోను వెండితోనూ అలాగే బంగారపు పలకలతో ఉన్న భూమిని చూచెను.

వారిజలములతో పూర్ణముగావున్న ఉత్తమమైన మణులతో పొదగబడిన సోపానములు కల జలాశయములను చూచెను. అవి ముత్యాలతో పగడాలతో పొదగబడిన, స్ఫటికములతో పూసలతో నిండిన, పొదగబడిన బంగారపు చెట్లుకల తీరములతో వున్నవి. వికసించిన తామరలతో కలువలతో నిండి , చక్రవాకముల కూతలతో నిండిన, నీటికోళ్ళ ధ్వనులతో, హంస సారస పక్షులమధురనాదాములతో నిండి యున్నది. పొడవైన వృక్షములతో, అమృతమయమైన జలములతో శుభకరమైన సరస్సులతో నిండియున్నది. వందలకొలది లతలతో నిండి యున్నఅనేకరకములైన పొదలతో నిండిన, సంతానక వృక్షముల కుశుమములతో నిండిన, కరవీర వృక్షములతో నిండిన జలాశయములను చూచెను.

ఆ హరిశార్దూలము జగత్తులో రమ్యమైన మేఘములను అంటుకుంటున్న ఏత్తైన శిఖరములు కల పర్వతమును , చిత్రవిచిత్ర కూటములు కల , శిలాగృహములతో కూడిన పర్వతమును చూసెను.

ఆ వానరుడు ఆ పర్వతము పైనుండి కింద పడుతో వున్న నదిని చూచెను. అది ప్రియుని అంకమునుండి జారిపోతున్న ప్రియురాలివలె నుండెను. జలములో వంగివున్న వృక్షములతో శోభిస్తున్న నదులలో వృక్షముచే నిరోధింపబడిన జలములు ప్రియబంధువులచే నివారింపబడి న కోపగించిన స్త్రీవలె కనపడుచున్నవి. అలా వ్యతిరిక్తదిశలో తిరుగు వస్తున్న జలములు కాంతుని సాంత్వ వచనములతో ప్రసన్నురాలే తిరిగివస్తున్న కాంత వలె కనపడెను.
మారుతాత్మజుడు హరిశార్దూలుడు అయిన హనుమంతుడు అక్కడ దగ్గరలోనే అనేక పక్షుల సమూహములతో, తామరలతో నిండిన, చల్లని నీళ్లతో నిండిన, మణులతో పొదగబడిన సోపానములు కల ముత్యాల ఇసుకతో శోభిల్లుచున్న, అనేకరకముల మృగముల గుంపులతో కూడిన చిత్ర విచిత్రములైన విశ్వకర్మచే నిర్మింపబడిన అనేకరకములుగా అలంకరింపబడిన ప్రాసాదములు కల సరస్సును చూచెను.
ఆ వృక్షములు ఫలపుష్పభరితములై వున్నవి. కొన్ని వృక్షములకింద చత్రములు బంగారు వేదికలు అమర్చబడి ఉన్నవి.

ఆ వానరోత్తముడు అనేక లతలతో ఆకులతో నిండియున్న బంగారు వేదికతో వున్న శింశుపావృక్షమును చూచెను.

ఆ వానరుడు అక్కడ కొన్ని సెలయూటలతో వున్న భూమి భాగములు, పొడవైన శిఖరముల వలె నున్న బంగారు వన్నెగల వృక్షములు చూచెను. ఆ వానరవీరుడు ఆ వృక్షముల కాంతి చూసి తను మేరుపర్వతముల కాంతిలో వెలుగుచున్న దివాకరుని వలే నున్నవాడని తలచెను. బంగారురంగు కల శాఖలు గాలిలోవూగుతూ ఆ గాలిసడలికిచే శబ్దము చేస్తున్న అనేకమైన చిరుగంటల ఘోష చూసి ఆ వానరుడు విస్మయము పొందెను.

అ మహాబాహువు విరబూచిన కొమ్మలు కల, లేత చిగుళ్ళ అంకురాలు కల కోమ్మలతో నున్న ఆ శింశుపా వృక్షము ఎక్కి ' రాఅమదర్శన లాలస అయిన వైదేహి ని, దుఖములో ఇక్కడ అక్కడ తిరుగుతూ వున్న సీతన్య్ అనుకోకుండా ఇక్కడ చూచెదనేమో అని అనుకొనెను.

రమ్యమైన చంపక చందన వకుళ వృక్షములతో కల దృఢమైన ఈ అశోకవనిక తప్పక ఆ దురాత్ముడిదే.

పక్షి సంఘములచేసేవింబడుచున్న ఈ అశోకవనిక రమ్యము. ఆ రామమహిషి జానకి తప్పక ఇక్కడ ఉండును. ఆ రామమహిషి రాఘవుని ప్రియురాలు వనసంచారములో కుశల ఇక్కడ తప్పక రావచ్చును. లేక లేడి వంటి కళ్ళు కల , వనజీవన విచక్షణాజ్ఞానము కల రాముని గురించి చింతాక్రాంతురాలైన పూజ్యురాలైన ఆ సీత ఇక్కడికి వచ్చును.

రాముని ఏడబాటుతో కలిగిన శోకములో మునిగియున్నవామలోచన , వనవాసములో మక్కువ గల ఆ వనచారిణి ఇక్కడికి వచ్చును. రాముని ప్రియభార్య జనకుని సుత, సతీ వనములో సంచరించువారిపట్ల ఆదరణ వుండుట తథ్యము.

మంచి రంగుకల ఆ సీత సంధ్యాకాలము గుర్తించి ఈ శుభకరమైన జలములుకల ఈ నదికి తప్పక వచ్చును. శుభప్రదమైన ఈ వనము రాజాధిరాజైఅ న రాముని పత్నిమంఘలప్రదురాలైన సీతకు నివశింపతగినది గా వున్నది. చంద్రబింబము వంటి ముఖము కల ఆ సీతాదేవి జివించియుంటే ఈ శుభప్రదమైన జలములు ఉన్న ఈ నది వద్దకు వచ్చును.

ఈ విధముగా హనుమంతుడు అలోచిస్తూ ఆ మనుజేంద్ర పత్నిని రాకకై నిరీక్షిస్తూ ఆ పుష్పములు కల కొమ్మల లో దాగి ఆన్ని చోటలా పరికించెను.

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో పదునాలుగవ సర్గ సమాప్తమ

||ఓం తత్ సత్||
శ్లో|| ఏవం తు మత్వా హనుమాన్ మహాత్మా
ప్రతీక్షమాణో మనుజేన్ద్రస్య పత్నీమ్|
అవేక్షమాణాశ్చ దదర్శ సర్వమ్
సుపుష్పితే పర్ణఘనే నిలీనః||52||
స|| మహాత్మా హనుమాన్ ఏవం మత్వా మనుజేంద్రపత్నీం ప్రతీక్షమాణః సుపుష్పితే పర్ణఘనే నిలీనః అవేక్షమాణశ్చ సర్వం దదర్శ||
తా|| ఈ విధముగా హనుమంతుడు అలోచిస్తూ ఆ మనుజేంద్ర పత్నిని రాకకై నిరీక్షిస్తూ ఆ పుష్పములు కల కొమ్మల లో దాగి ఆన్ని చోటలా పరికించెను.
||ఓం తత్ సత్||